Raja Singh: ఫేస్ బుక్ నుంచి నిష్క్రమించి సంవత్సరమైంది, నన్నెలా నిషేధిస్తారు?... ఫేస్ బుక్ పై కాంగ్రెస్ ఒత్తిడి ఉంది: రాజాసింగ్
- రాజాసింగ్ పై ఫేస్ బుక్ నిషేధం
- విద్వేష భావజాలం వ్యాప్తిచేస్తున్నారంటూ ఆరోపణలు
- త్వరలో కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తానని రాజాసింగ్ వెల్లడి
విద్వేషపూరిత భావజాలం వ్యాప్తి చేస్తున్నారంటూ ప్రమాదకర వ్యక్తిగా ముద్రవేసి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఫేస్ బుక్ నిషేధించడం తెలిసిందే. ఫేస్ బుక్ నిర్ణయంపై రాజాసింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ఫేస్ బుక్ నుంచి నిష్క్రమించి ఏడాది అయిందని, అలాంటప్పుడు తనను ఏవిధంగా నిషేధించగలరని ప్రశ్నించారు. చూస్తుంటే ఫేస్ బుక్ పై కాంగ్రెస్ ఒత్తిడి ఉన్నట్టుగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
బీజేపీ సభ్యులకు అనుకూలంగా ఫేస్ బుక్ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందిస్తూ... 2019 ఏప్రిల్ నుంచి తనకు ఫేస్ బుక్ లో అకౌంట్ లేదని, ప్రస్తుతం ఫేస్ బుక్ నిషేధించిన పేజీలు తన అభిమానులు నిర్వహిస్తున్నవి అయ్యుండొచ్చని పేర్కొన్నారు. ఓ తటస్థ వేదిక అయిన ఫేస్ బుక్ ను బీజేపీతో ముడివేయడం సబబు కాదని అన్నారు.
అంతేకాదు, అధికారిక అకౌంట్ కావాలంటూ ఫేస్ బుక్ కు లేఖ రాస్తానని, అన్ని నియమనిబంధనలు పాటిస్తానని రాజాసింగ్ వెల్లడించారు. ఫేస్ బుక్ ఖాతా ఉపయోగించుకునే హక్కు తనకు ఉందని, అందుకే వారి అనుమతి తీసుకుంటున్నానని తెలిపారు.