Somu Veerraju: ఇది 'బీజేపీ ఏపీ' సాధించిన విజయం: ఏపీలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ బ్యాన్పై సోము వీర్రాజు
- ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల సామాన్య ప్రజల ధోరణిలో మార్పు
- ప్రజల సొమ్ము దోపిడీ అవుతుంది
- జగన్ గారి దృష్టికి నేను 2020, మేలో తీసుకొచ్చాను
- అలానే గుట్కా అమ్మకాలు కూడా అరికట్టాలి
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు, ఆడేవారికి జైలు శిక్ష పడుతుందని ఏపీ సర్కారు తెలిపింది. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ తమ వల్లే ఏపీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు.
'ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల సామాన్య ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చే చెడు మార్పుల గురించి, ప్రజల సొమ్ము దోపిడీ అవడం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి దృష్టికి నేను 2020, మేలో తీసుకొచ్చాను. అలానే గుట్కాని ప్రభుత్వం నిషేధించినప్పటికీ, కిరాణా షాపుల్లో, కిళ్లీ షాపుల్లో బ్లాక్ మార్కెట్ లో గుట్కా దొరకడం గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించాను' అని సోము వీర్రాజు తెలిపారు.
'ఈ రోజు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం బీజేపీ ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయం. అలాగే గుట్కా అమ్మకాలు కూడా అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను' అని సోము వీర్రాజు ట్వీట్లు చేశారు.