ESI Scam: తెలంగాణ ఈఎస్ఐ స్కాం: దేవికారాణి సహా 9 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్
- సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం
- నిందితులను కోర్టు ముందు హాజరు పరిచిన అధికారులు
- చంచల్ గూడ జైలుకు నిందితుల తరలింపు
తెలంగాణలో చోటుచేసుకున్న ఈఎస్ఐ స్కాంలో నిందితులను నేడు కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
తెలంగాణ ఈఎస్ఐలో మెడికల్ కిట్లు, ఔషధాల కొనుగోళ్లు, ఇతర లావాదేవీల్లో నకిలీ బిల్లుల సాయంతో రూ.6.5 కోట్లు స్వాహా చేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ డైరెక్టర్ దేవికారాణి, కంచర్ల శ్రీహరిబాబు, వసంత ఇందిర, కె.పద్మ, కంచర్ల సుజాత, వెంకటేశ్, చెరుకూరి నాగరాజు, బండి వెంకటేశ్వర్లు, కృపాసాగర్ రెడ్డిలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవలే దేవికారాణి, నాగలక్ష్మిలకు చెందిన రూ.4.47 కోట్ల సొమ్మును అధికారులు ఓ రియల్ ఎస్టేట్ బిల్డర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణి, నాగలక్ష్మి తమ అవినీతి సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించేందుకు ప్రయత్నించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.