Sonia Gandhi: సోనియాకు లేఖ రాసి అలజడి రేపిన కాంగ్రెస్ బహిష్కృత నేతలు
- ప్రస్తుతం పార్టీ నడుస్తున్న తీరు బాగోలేదు
- కార్యకర్తల్లో గందరగోళం
- కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించాలి
- ప్రజాస్వామ్య విలువలు పునరుద్ధరించాలి
ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆ పార్టీకి చెందిన 23 మంది సీనియర్ నేతలు రాసిన లేఖ దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, ఆమెకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ బహిష్కృత నేతలు సంతోష్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి లేఖ రాసి అలజడి రేపారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేశారని, ప్రజాస్వామ్య పునాదులు వేశారని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం పార్టీ నడుస్తున్న తీరు చూస్తుంటే కార్యకర్తల్లో గందరగోళాన్ని నెలకొల్పే విధంగా ఉందని అన్నారు. కార్యకర్తల్లో నిరాశ ఆవహిస్తోందని, భారత్ లో ప్రజాస్వామ్య విలువలు నాశనమవుతున్న ప్రస్తుత సమయంలో దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందని వారు చెప్పుకొచ్చారు. ఆ పార్టీ సమర్థంగా కొనసాగాలని, అందుకు కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించాలని, పార్టీ సంప్రదాయాలతో పాటు ప్రజాస్వామ్య విలువలు
పునరుద్ధరించాలని లేఖలో కోరారు.