Smart Phone: చోరీ చేసిన స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలియక సొంతదారుకు తిరిగిచ్చేసిన దొంగ!
- పశ్చిమ బెంగాల్ లో ఘటన
- స్వీట్ షాపులో ఫోన్ మర్చిపోయిన వ్యక్తి
- రూ.45 వేల విలువైన ఫోన్ ను ఎత్తుకెళ్లిన కుర్రాడు
సాధారణంగా చోరీ చేసిన సొత్తును ఎక్కడైనా అమ్ముకోవడం దొంగల ప్రధాన లక్షణం. కానీ ఈ దొంగ అందుకు విరుద్ధంగా వ్యవహరించి ఆశ్చర్యానికి గురిచేశాడు. పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి జమాల్పూర్ పట్టణంలో మిఠాయి దుకాణానికి వెళ్లాడు. అక్కడ తన ఫోన్ మర్చిపోయి ఇంటికి తిరిగొచ్చాడు. ఆ ఫోన్ ను 22 ఏళ్ల కుర్రాడు దొంగిలించాడు. ఆ ఫోన్ ఖరీదు రూ.45 వేలు. ఎంతో ఖరీదైన ఫోన్ కావడంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తులో భాగంగా స్వీట్ షాపుకు వెళ్లగా, అక్కడ ఫోన్ లభ్యం కాలేదు. ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వేరే నెంబర్ నుంచి తన ఫోన్ కు కాల్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. పదేపదే ఆ ఫోన్ కు కాల్ చేయగా, ఫోన్ కొట్టేసిన యువకుడు ఎట్టకేలకు స్పందించాడు. ఫోన్ ను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నానని, ఆ ఫోన్ ను ఎలా ఆపరేట్ చేయాలో తెలియడంలేదని చెప్పాడు.
దాంతో ఫోన్ సొంతదారు విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. దొంగే తన ఫోన్ ను తిరిగిచ్చేయాలని చెప్పడంతో నమ్మలేకపోయానని, పోలీసుల సాయంతో ఆ యువకుడి ఇంటికి వెళ్లి ఫోన్ తెచ్చుకున్నానని వెల్లడించాడు. ఫోన్ తిరిగిచ్చేయడంతో ఆ కుర్రాడ్ని ఏమీ చేయవద్దని ఫోన్ సొంతదారు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.