Jayaprakash Reddy: జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
- చంద్రబాబు, సోము వీర్రాజు సంతాపం
- గొప్పనటుడిని కోల్పోయామని విచారం
- వెంకటేశ్, మహేశ్, తారక్ ట్వీట్లు
టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
'తెలుగు సినిమా, థియేటర్ ఈ రోజు ఓ రత్నాన్ని కోల్పోయింది. దశాబ్దాలుగా ఇచ్చిన ఆయన బహుముఖ ప్రదర్శనలు మనకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఆయన కుటుంబానికి, మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
'టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీ జయప్రకాశ్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం గుంటూరులో గుండెపోటుతో మరణించడం బాధాకరం. ప్రత్యేకమైన స్లాంగ్ తో తెలుగు సినీ ప్రేక్షకులకు చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపాన్ని తెలియజేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
'జయప్రకాశ్ రెడ్డి గారి మరణవార్త విని బాధపడ్డాను. ఆయన చాలా నిబద్ధతతో పనిచేసేవారు. ప్రతి పాత్రలో గొప్పగా నటించారు. సమరసింహారెడ్డి సినిమాలో ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
'నా ప్రియ మిత్రుడు జయప్రకాశ్ రెడ్డి గారి మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. వెండితెరపై మా కాంబినేషన్ అద్భుతంగా ఉండేది. ఆయనను చాలా మిస్ అవుతాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు.
'జయప్రకాశ్ రెడ్డి గారి మరణవార్త విని బాధపడ్డాను. టాలీవుడ్ లో ఆయన ఓ గొప్ప కమెడియన్. ఆయనతో కలిసి పనిచేసిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని సినీనటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
'అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాశ్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.
'సహచర నటుడు జయప్రకాశ్ రెడ్డి గారి హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను' అని సినీనటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
'మాకు ఎంతగానో వినోదాన్ని పంచినందుకు థ్యాంక్యూ సర్' అని సినీనటుడు రామ్ పోతినేని ట్వీట్ చేశాడు. 'ఉదయం లేస్తూ ఈ విషాదకర వార్త విన్నాను. మీ ఆత్మకు శాంతి కలగాలి సర్' అని సినీనటుడు సుధీర్ బాబు అన్నాడు.