Vijay Sai Reddy: రమేశ్ హాస్పిటల్స్ పై చంద్రబాబు ఈగ కూడా వాలకుండా కాపాడాడు: విజయసాయిరెడ్డి
- రథం దగ్ధంపై చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేశారు
- స్వర్ణ ప్యాలేస్ ప్రమాదంలో 10 మంది మృతి
- దానిపై కనీసం నోరు కూడా మెదపలేదెందుకు?
- ప్రజలు అడుగుతున్నారు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి వారి రథం దగ్ధమైన విషయం తెలిసిందే. ఇది ప్రమాదమా? లేక దుండగులు చేసిన పనా? అన్న విషయాన్ని తేల్చడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఈ ఘటనలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి, ఇందులో సభ్యులుగా నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావును చేర్చిన విషయం తెలిసిందే. వీరు అంతర్వేదిలో రథం దగ్ధమైన ప్రాంతాన్ని సందర్శించి చంద్రబాబుకు నివేదిక అందిస్తారు. అయితే, దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
"అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజనిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకనని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు" అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.