India: భారత్-చైనా సరిహద్దుల వద్ద కాల్పులపై ప్రకటన చేసిన భారత్!
- సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
- భారత్ కాల్పులు జరిపిందని చైనా ప్రచారం
- చైనా బలగాలు రెచ్చగొడుతున్నాయన్న భారత్
- తాము కాల్పులు జరపలేదని స్పష్టం చేసిన ఇండియా
భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న విషయం తెలిసిందే. గత అర్ధరాత్రి కాల్పులు జరిగాయని, భారత ఆర్మీయే ఈ చర్యలకు పాల్పడిందని చైనా తీవ్ర ఆరోపణలు చేస్తోన్న నేపథ్యంలో ఈ విషయంపై భారత్ స్పందించి ఓ ప్రకటన విడుదల చేసింది. తూర్పు లడఖ్ సమీపంలో గాల్లోకి కాల్పులు జరిగినట్లు వచ్చిన వార్తలపై స్పష్టతనిచ్చింది.
వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే క్రమంలో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపింది. సరిహద్దుల వద్ద చైనా బలగాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయని భారత్ స్పష్టం చేసింది. అయినప్పటికీ భారత్ ఎంతో సంయమనం పాటిస్తోందని చెప్పింది. భారత సైన్యం వాస్తవాధీనరేఖ వెంబడి అతిక్రమణకు పాల్పడలేదని వివరించింది. అక్కడ కాల్పుల వంటి చర్యలకు కూడా భారత సైన్యం దిగలేదని తేల్చిచెప్పింది.