PUBG: నిషేధం ఎఫెక్ట్: చైనా సంస్థను తప్పించిన పబ్జీ కార్పొరేషన్
- ఇటీవల పబ్జీని నిషేధించిన కేంద్రం
- పబ్జీ యాప్ లో చైనా సంస్థ టెన్ సెంట్ కు భాగస్వామ్యం
- టెన్ సెంట్ ను పక్కనబెట్టిన పబ్జీ కార్పొరేషన్
- ఇకపై పూర్తిగా దక్షిణ కొరియా యాప్ గా పబ్జీ
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. చైనా వ్యక్తుల యాజమాన్యంలో ఉన్న యాప్ లే కాదు, చైనా వ్యక్తుల ఫ్రాంచైజీ ఉన్నా భారత్ వదిలిపెట్టబోదని పబ్జీ యాప్ పై నిషేధంతో వెల్లడైంది.
వాస్తవానికి పబ్జీ గేమింగ్ యాప్ చైనాకు చెందింది కాదు. పబ్జీ... దక్షిణ కొరియాకు చెందిన పబ్జీ కార్పొరేషన్ కు చెందిన యాప్. ఈ పబ్జీ కార్పొరేషన్ ప్రముఖ గేమింగ్ దిగ్గజం బ్లూహోల్ కు అనుబంధ సంస్థ. అయితే, పబ్జీ గేమింగ్ హక్కులను కలిగివున్న పబ్జీ కార్పొరేషన్ అనేక దేశాల్లో తమ గేమింగ్ యాప్ ను ఫ్రాంచైజీలకు అప్పగించింది. ఆ విధంగా చైనాకు చెందిన టెన్ సెంట్ కంపెనీకి కూడా ఫ్రాంచైజీ ఇవ్వగా, టెన్ సెంట్ కంపెనీ భారత్ తదితర దేశాల్లో పబ్జీ గేమింగ్ యాప్ ను నిర్వహిస్తోంది.
అయితే, చైనా సంస్థ భాగస్వామ్యం ఉందన్న కారణంగా పబ్జీని భారత్ నిషేధించడంపై పబ్జీ కార్పొరేషన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. టెన్ సెంట్ చేతిలో ఉన్న ఫ్రాంచైజీ హక్కులను వెనక్కి తీసుకుంది. దాంతో ఇప్పుడు పబ్జీ పూర్తిగా దక్షిణ కొరియా గేమింగ్ యాప్ అవుతుంది. ఇకపై పబ్జీ గేమ్ దక్షిణ కొరియాలో ఉన్న సర్వర్లపైనే ఆధారపడి పనిచేస్తుంది.
దీనిపై పబ్జీ కార్పొరేషన్ స్పందిస్తూ, తాజా పరిణామాల నేపథ్యంలో టెన్ సెంట్ నుంచి పబ్లిషింగ్ అధికారాలను వాపసు తీసుకుంటున్నామని తెలియజేసింది. మున్ముందు పబ్జీ గేమింగ్ యాప్ నిర్వహణలో ఫ్రాంచైజీ వ్యవస్థ లేకుండా చూస్తామని తెలిపింది. ఫ్రాంచైజీలతో సంబంధం లేకుండా భారత్ లో నేరుగా పబ్జీ గేమింగ్ యాప్ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది.