Corona Virus: కరోనా పరీక్షలపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
- కరోనా సోకిందా? లేదా? అని తెలుసుకునే హక్కు అందరికీ ఉంది
- ప్రైవేట్ ఆసుపత్రులకు రోజుకు 2 వేల పరీక్షలకు అనుమతి ఇవ్వండి
- టెస్టులు చేయించుకునేవారికి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది
తనకు కరోనా పాజిటివా లేక నెగెటివా అనే విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. కోవిడ్ టెస్టు కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని... ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని చెప్పింది. మరోవైపు గత వారం రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా లక్షణాలు ఉంటేనే ఇప్పటి వరకు ఢిల్లీలో పరీక్షలు నిర్వహించేవారు. లక్షణాలు లేని వారు టెస్ట్ చేయించుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుతో నిబంధనలు మారనున్నాయి. ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి రోజు 2 వేల పరీక్షలు నిర్వహించే వెసులుబాటును ప్రైవేట్ ఆసుపత్రులకు కల్పించాలని హైకోర్టు తెలిపింది. వాలంటరీగా టెస్టులు చేయించుకోవాలనుకునే వారు అక్కడకు వెళ్లి చేయించుకుంటారని చెప్పింది.