Raghu Ramakrishna Raju: జగన్ గారూ.. అతనే మీకు చెప్పాడట కదా?: రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
- వైసీపీ కీలక నేతపై రఘురాజు తీవ్ర వ్యాఖ్యలు
- ఇకనుంచైనా సొంతంగా ఆలోచించాలని జగన్ కు హితవు
- లేకపోతే మీ ప్రయత్నాన్ని అందరూ హాస్యాస్పదంగా భావించే పరిస్థితి వస్తుంది
వైసీపీలోని ఒక కీలక నేతను ఉద్దేశించి ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ కీలక నేత పేరును ఉచ్చరించకుండానే... జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యాంగ విరుద్ధమైన పని చేశానంటూ మీరు ప్రత్యేక విమానంలో కొంతమంది చేత డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ ను లోక్ సభ స్పీకర్ కు పంపించారని అన్నారు. తెలుగు మీడియం ఉండాలని తాను మాట్లాడటమే తన తప్పైపోయిందని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా మాట్లాడిన తనను డిస్ క్వాలిఫై చేయించేందుకు మీరు చేసిన ప్రయత్నాన్ని... పార్లమెంటులోని తోటి ఎంపీలు సహా అందరూ హాస్యాస్పదంగా భావించే పరిస్థితి వస్తుందని అన్నారు.
మాతృభాష ఆవశ్యకత గురించి ప్రధాని మోదీ కూడా మాట్లాడారని... నూతన జాతీయ విద్యా విధానంలో కూడా మాతృభాషకు పెద్ద పీట వేశారని చెప్పారు. తాను కూడా అదే విషయాన్ని చెప్పానని అన్నారు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం అంటూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని... దానిపై వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి మంచి జరగాలనే తాను ఈ విషయం చెపుతున్నానని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులకు వైసీపీలో స్థానం ఉండదనే విషయం ఇప్పుడు ఏపీ వరకే తెలుసని... రేపు పార్లమెంటులో ఉన్న ఎంపీల వల్ల దేశంలో ఉన్న అందరికీ తెలుస్తుందని హెచ్చరించారు.
'నన్ను డిస్ క్వాలిఫై చేసేందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఒక పనికిమాలిన వెధవ... ఆ పనికిమాలిన వెధవ ఎవరో రాష్ట్రంలో ఇప్పటికే చాలా మందికి తెలిసింది. ఆ పనికిమాలిన వెధవే మీకు చెప్పాడంట. నాకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు. నేను డిస్ క్వాలిఫై చేయించేస్తానని మీకు చెప్పాడంట. ఇలాంటి పనికిమాలిన వెధవను పక్కన పెట్టి, మీరు సొంతంగా ఆలోచించండి' అని రఘురాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పులు ఎవరైనా చేస్తారని... క్షణికావేశంలో మీరు నమ్ముకున్న ఇంగ్లీష్ మీడియం కోసం మీరు తప్పు చేశారని... ఇప్పటికైనా పునరాలోచించి, ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని అన్నారు.