Corona Virus: ఆక్స్ ఫర్డ్ మాజీల నుంచి మరో వ్యాక్సిన్... ఇండియాలోనూ ట్రయల్స్!

Corona Vaccine from Ex Oxford Scientists

  • ఇండియాలో పరీక్షించనున్న సీరమ్ ఇనిస్టిట్యూట్
  • 2017లో ఆక్స్ ఫర్డ్ ను వీడిన స్పై బయోటెక్
  • హెపటైటిస్ బీ యాంటీజెన్ ఆధారంగా వ్యాక్సిన్
  • వైరస్ మొనలను నిర్వీర్యం చేయడమే లక్ష్యం

ఇప్పటికే కరోనాను నివారించే ఓ వ్యాక్సిన్ ను ఆక్స్ ఫర్డ్ వర్శిటీ అభివృద్ధి చేయగా, గతంలో ఆక్స్ ఫర్డ్ తో కలిసుండి, ఆపై విడిపోయిన శాస్త్రవేత్తలు, మరింత మెరుగైన పనితీరును చూపే రెండో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారని తెలుస్తోంది. దాని ట్రయల్స్ ఆస్ట్రేలియాతో పాటు ఇండియాలోనూ జరుగనున్నాయి. ప్రపంచంలోనే వ్యాక్సిన్ తయారీలో అతిపెద్ద సంస్థగా ఉన్న పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్, ఈ కొత్త వ్యాక్సిన్ ను ఇండియాలో ప్రయోగించి, పరిశీలించనుంది.

కరోనాకు అత్యంత నమ్మకమైన వ్యాక్సిన్ గా పేరు తెచ్చుకున్న ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా వైరస్ కు సమాంతరంగా ఇది రూపొందటం గమనార్హం. 2017లో ఆక్స్ ఫర్డ్ నుంచి తెగదెంపులు చేసుకున్న యూకే సంస్థ స్పై బయోటెక్, జెన్నర్ ఇనిస్టిట్యూట్ కు చెందిన అడ్రియన్ హిల్, సారా గిల్ బర్డ్, సుమీ బిశ్వాస్ తదితరులతో కలిసి ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. వీరంతా గతంలో ఆక్స్ ఫర్డ్ తో కలిసి పనిచేయడం విశేషం.

ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆస్ట్రేలియాలో ఒకటి, రెండో దశ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇండియాలోనూ మొదలు పెట్టాలని భావిస్తోంది. హెపటైటిస్ బీ యాంటీజెన్ కు సంబంధించిన వైరస్ ను పోలిన కణం ఆధారంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. కరోనా వైరస్ కు ఉండే మొనలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. ఇందుకోసం 'సూపర్ గ్లూ' సాంకేతికతను వాడారు. ఇందులో భాగంగా స్పై బయోటెక్ అభివృద్ధి చేసిన యాంటీజెన్ లు, వైరస్ చుట్టూ చేరిపోయి, అది ప్రభావం చూపకుండా చేస్తాయి.

ఈ వైరస్ ను అభివృద్ధి చేయడంలో బిశ్వాస్ పాత్ర ఎంతో ప్రధానమైనదని తెలుస్తోంది. ఆక్స్ ఫర్డ్ నుంచి పీహెచ్డీ పొందిన ఆమె, జెన్నర్ ఇనిస్టిట్యూట్ లో మలేరియా వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఎంతో శ్రమించారు. జెన్నర్ లో ప్రధాన ఇన్వెస్టిగేటర్ గా ఉన్నారు. ఇక ఈ వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసి అందించేందుకు స్పై బయోటెక్ సంస్థ ఇప్పటికే సీరమ్ తో డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే ఆస్ట్రాజెనికా తయారు చేస్తున్న ఆక్స్ పర్డ్ వ్యాక్సిన్ ను 100 కోట్ల డోస్ లను అందించేందుకు సీరమ్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిక రెండు వ్యాక్సిన్ లనూ తయారు చేసేందుకు సీరమ్ తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News