Corona Virus: అన్ని రకాలుగా సురక్షితమైతేనే వ్యాక్సిన్ బయటకు... బహిరంగ లేఖలో దిగ్గజ ఫార్మా సంస్థలు!
- వ్యాక్సిన్ విషయంలో తొందరపడటం లేదు
- దగ్గరి దారులను వెతకడం లేదు
- బహిరంగ లేఖపై ప్రముఖ కంపెనీల సీఈఓల సంతకాలు
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ విషయంలో తాము త్వరపడటం లేదని, అన్ని రకాలుగా సురక్షితమని తేలితేనే టీకాను అందుబాటులోకి తెస్తామని దిగ్గజ ఫార్మా సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు పలు కంపెనీల సీఈఓలు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆస్ట్రాజెనికా, మోడెర్నా, ఫైజర్, నోవావ్యాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఈ లేఖపై సంతకాలు చేయడం గమనార్హం.
తమకు ప్రజారోగ్యం, వారి భద్రతే ముఖ్యమని, వ్యాక్సిన్ ట్రయల్స్ ను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచన లేదని, దగ్గరి దారులను అనుసరించడం లేదని వారు స్పష్టం చేశారు. ఏ వ్యాక్సిన్ అయినా, పూర్తిగా సురక్షితమని తేలిన తరువాతే ఆమోదం కోసం నియంత్రణా సంస్థలకు దరఖాస్తు చేస్తామని తెలిపారు. కాగా, ఈ లేఖలో చైనా, రష్యాలకు చెందిన ఫార్మా కంపెనీలు మాత్రం సంతకాలు చేయక పోవడం గమనార్హం.
ఇదిలావుండగా, మరో నెల రోజుల్లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపింది. నవంబర్ లో ఎన్నికలను ఎదుర్కోనున్న ఆయన, ప్రజల మెప్పు కోసమే ఇటువంటి అసత్యపు ప్రకటనలు చేస్తున్నారని డెమోక్రాట్ల తరఫు అభ్యర్థి జో బైడెన్ ఆరోపించారు. ట్రంప్ మాటలు నమ్మశక్యంగా లేవని, ట్రయల్స్ ముగియకుండానే వ్యాక్సిన్ ను ఎలా తెస్తారని ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ విమర్శలు కురిపించారు. ఇక, ట్రంప్ చెప్పినట్టుగా అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ ను విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చని యూఎస్ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు.