Tejashwi Yadvav: నిరుద్యోగులంతా చేతులు కలపండి.. రాత్రికి కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించండి: తేజస్వీ యాదవ్ పిలుపు
- 9 గంటల 9 నిమిషాలకు లైట్లు ఆర్పివేయండి
- మాకు అవకాశం లభిస్తే నిరుద్యోగ నిర్మూలనకు కృషి
- ఇది రాజకీయ ఉద్యమం కాదు
బీహార్‌లో పెరిగిపోతున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా యువకులు చేతులు కలపాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నేటి రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ప్రతి ఒక్కరు లైట్లు ఆర్పివేసి 9 నిమిషాలపాటు కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించి నిరసన తెలపాలని కోరారు. ఈ మేరకు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్జేడీకి అవకాశం లభిస్తే నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు.
తమది రాజకీయ ఆందోళన కాదని, నిరుద్యోగులైన యువకులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ ఉద్యమాన్ని చేపట్టాయని తెలిపారు. దీనికి ఆర్జేడీ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. నిరుద్యోగులంతా ఈ ఉద్యమంలో పాల్గొనాలని, రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ప్రతి ఒక్కరు లాంతర్లు, కొవ్వొత్తులు వెలిగించాలని సూచించారు. నిరుద్యోగుల సమస్యలు తెలుసుకునేందుకు వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తామన్నారు. తాను కూడా తల్లి రబ్రీదేవితో కలిసి అదే సమయానికి ఇంట్లోని లైట్లు ఆర్పివేసి లాంతర్లు వెలిగిస్తామని తేజస్వీయాదవ్ తెలిపారు.