Facebook: ఫేస్బుక్ సరైన మార్గంలో నడవడం లేదట.. ద్వేషం నుంచి లాభాలు పొందుతోందంటూ ఉద్యోగి రాజీనామా
- ఫేస్బుక్లో నేడే తన చివరి రోజంటూ పోస్టు పెట్టిన యువ ఇంజినీర్ అశోక్
- ద్వేష భావంలో తాను భాగం కాలేక రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి
- ఆరోపణలు ఖండించిన ఫేస్బుక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్పై ఆ సంస్థ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అశోక్ చంద్వానే (28) తీవ్ర ఆరోపణలు చేశారు. ఫేస్బుక్ ద్వేషం నుంచి లాభాలను పొందుతోందని పేర్కొన్న ఆయన ఇక తాను అందులో ఇమడలేనంటూ బయటకు వచ్చేశారు. దాదాపు ఐదున్నర సంవత్సరాల తర్వాత ఆ సంస్థలో ఇదే తన ఆఖరి రోజని ఫేస్బుక్లో పోస్టు పెట్టారు.
అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ద్వేషం నుంచి అది లాభాలు పొందాలనుకుంటోందని, అందులో తాను భాగంగా ఉండడం తనకు ఇష్టం లేదని, అందుకనే రాజీనామా చేస్తున్నానని అశోక్ పేర్కొన్నారు. ఫేస్బుక్లో పోస్టు అవుతున్న అసత్య సమాచారాన్ని నియంత్రించాలంటూ హక్కుల ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు మొత్తుకుంటున్నా ఫేస్బుక్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అశోక్ ఆరోపణలపై ఫేస్బుక్ ప్రతినిధి లిజ్ బర్గేయస్ స్పందించారు. అశోక్ ఆరోపణల్లో నిజం లేదని, తమ సంస్థ ఎప్పుడూ విద్వేషం ద్వారా లాభం పొందలేదని స్పష్టం చేశారు. రాజకీయ, తదితర అంశాలపై నిపుణుల సూచన మేరకు ఎప్పటికప్పుడు మారుస్తున్నామన్నారు. ఎటువంటి ఫిర్యాదు రాకున్నా మిలియన్ల కొద్దీ విద్వేష పూరిత పోస్టులను తొలగించినట్టు ఆమె వివరించారు.