Corona Virus: కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాం: కేసీఆర్
- అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
- ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ బెటరన్న సీఎం
- కరోనా కట్టడికి వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశామన్న కేసీఆర్
కరోనా మహమ్మారిపై నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక ప్రకటన చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయమై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే మన ఆరోగ్య శ్రీ ఎన్నో రెట్లు పటిష్టంగా ఉందన్న సీఎం.. ఆయుష్మాన్ భారత్‌తో కలిపి ఆరోగ్యశ్రీని నడిపిస్తామని గవర్నర్ కు కూడా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కరోనా చికిత్స విషయంలో కార్పొరేట్ ఆసుపత్రులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని, శవాలు ఇవ్వడానికి కూడా డబ్బుల కోసం పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు లూటీ చేస్తాయని తాను ఎప్పుడో చెప్పానన్నారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్పారు. తాను గాంధీ ఆసుపత్రికి వెళ్లలేదంటున్నారని, కానీ రాత్రీపగలు కరోనా కట్టడికి కష్టపడి పనిచేశామని కేసీఆర్ అన్నారు.