Donald Trump: కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు: విరుచుకుపడ్డ జో బైడెన్
- కరోనా వైరస్ విజృంభణను ఎదుర్కోవడంలో విఫలం
- 1,90,000 మంది మృతి చెందారు
- రాత్రుళ్లు భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులు దూరం
- దేశాన్ని మాంధ్యంలోకి నెట్టేశారు
కరోనా వైరస్ విజృంభణను ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తమ దేశాన్ని మాంధ్యంలోకి నెట్టేశారని అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాజాగా మిచిగాన్ లోని వారెన్ నగరంలో జో బైడెన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ట్రంప్ తీరుపై మండిపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తలకిందులు చేశారని ఆయన ఆరోపించారు. మార్చి, ఏప్రిల్ లో లక్షలాది మంది ఉద్యోగులు లేఆఫ్ లను ఎదుర్కోవాల్సి వచ్చిందని, వారిలో దాదాపు సగం మంది పూర్తిగా ఉద్యోగాలను కోల్పోయారని జో బైడెన్ విమర్శించారు.
ఈ పరిస్థితులన్నీ ట్రంప్ నిర్లక్ష్యం వల్లే వాటిల్లాయని, ఆయన అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అనర్హుడని విమర్శలు గుప్పించారు. 'రాత్రి భోజనం చేసే సమయంలో తమ కుటుంబంలోని కొందరు వ్యక్తులు తమతో లేరనే బాధను చాలా మంది అమెరికన్లు అనుభవిస్తున్నారు. ఇది ట్రంప్ వైఫల్యాల ఫలితమే' అని బైడెన్ వ్యాఖ్యానించారు. కరోనా వల్ల అమెరికాలో 1,90,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.