Twitter: కంగనాకు నీతా అంబానీ రూ.200 కోట్ల సాయం చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం... అసలు వాస్తవమిది!
- ట్విట్టర్ లో వైరల్ అయిన ఫేక్ న్యూస్
- అవాస్తవమని తేల్చిన ఫ్యాక్ట్ చెక్
- తాము స్పందించబోమన్న రిలయన్స్
బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నటి కంగనా రనౌత్ కొత్త కార్యాలయాన్ని కూల్చివేసిన తరువాత కర్ణిసేన, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ముంబై నగరాన్ని పీఓకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, పలువురు కంగనకు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ట్విట్టర్ వేదికగా, ఓ ఆసక్తికరమైన పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. కంగన స్టూడియోను కూల్చివేసిన నేపథ్యంలో కొత్త స్టూడియోను నిర్మించుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ సాయం చేసేందుకు ముందుకు వచ్చారని, కంగనకు ఏకంగా రూ. 200 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారన్నది ఆ పోస్ట్ సారాంశం.
ఇక ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయమై పలు ఫ్యాక్ట్ చెక్, ఫేక్ న్యూస్ డిటెక్షన్ ఏజన్సీలు శ్రమించాయి. చివరకు ఇది తప్పుడు వార్తని, నీతా అంబానీ నుంచి అటువంటి ప్రకటన ఏదీ రాలేదని తేలింది. ఇదే విషయమై స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులను 'ఇండియా టుడే' కోరగా, సోషల్ మీడియాలో వచ్చే క్లయిములపై స్పందించబోమన్న సమాధానం వచ్చింది.