Kanakamedala Ravindra Kumar: ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా?: వైసీపీ నేతలపై కనకమేడల ఫైర్
- అంతర్వేది ఘటనపై కనకమేడల స్పందన
- చంద్రబాబుపై ఆరోపణలు దారుణం అంటూ వెల్లడి
- ఆలయాలపై దాడుల ఘటనల్లో సీబీఐ దర్యాప్తుకు డిమాండ్
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తాజా పరిణామాలపై స్పందించారు. అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టింది చంద్రబాబేనని కొందరు ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. ప్రజలను అవహేళన చేసే రీతిలో అధికార వైసీపీ నేతలు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తుండడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు.
చంద్రబాబునాయుడు రథం తగులబెట్టాడని చెబుతూ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అలాగే తిరుమల శ్రీవారి వద్ద ఉండాల్సిన డైమండ్ ఎవరి వద్ద ఉందంటే ఇక్కడ కూడా చంద్రబాబు పేరే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి వాళ్లు అధికారంలోకి వచ్చాక అసలు డైమండే లేదని అంటున్నారని వివరించారు.
వారికి తెలిసిన విషయమల్లా ప్రజలను చులకన చేసి మాట్లాడడమేని, వారికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, వారికి వ్యవస్థల పట్ల, కోర్టుల పట్ల నమ్మకం లేదని విమర్శించారు. తమ బాసు ఈ రోజు ఏంచెబితే అది మాట్లాడుతుంటారని, వారికొచ్చిన భాషలోనే వారు మాట్లాడుతుంటారని అన్నారు. కొడాలి నాని వంటి వాళ్లు ప్రత్యేకమైన భాష వాడుతుంటారని, ఊరకుక్కలు అంటూ మాట్లాడుతుంటారని, అది వారి సంస్కారానికే వదిలేస్తున్నామని కనకమేడల పేర్కొన్నారు. ఇవతల చంద్రబాబు పక్కన ఉండేవి ఊరకుక్కలు అయితే, అటువైపు జగన్ పక్కన ఉండేవి ఏ కుక్కలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.
ఏదేమైనా సీఎంగా జగన్ వచ్చాక ఆలయాలపై 17 దాడులు జరిగాయని ఆరోపించారు. దీనికి అధికారపక్షమే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. మీకు నమ్మకం ఉన్న సీబీఐతోనే విచారణ జరిపించండి అంటూ కనకమేడల డిమాండ్ చేశారు.