Puvvada Ajay Kumar: అప్పటివరకు తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సమావేశం లేదు: తెలంగాణ మంత్రి పువ్వాడ
- దేశవ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ
- తెలుగు రాష్ట్రాల మధ్య తిరగని బస్సు సర్వీసులు
- సరిహద్దుల వరకే బస్సులు తిప్పుతున్న రాష్ట్రాలు
- కిలోమీటర్ బేసిస్ లో కుదరని ఒప్పందం
కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలకు వీలు కలుగుతోంది. అయితే ఏపీ నుంచి హైదరాబాదుకు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు బస్సులు తిప్పే విషయంలో తెలుగు రాష్ట్రాల రవాణాశాఖల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పటికే అధికారుల స్థాయిలో ఇరు రాష్ట్రాల మధ్య సమావేశాలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈసారి తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రులు సమావేశమవుతారంటూ ప్రచారం జరుగుతోంది.
దీనిపై తెలంగాణ రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల అంశంపై ఏపీ రవాణా శాఖ మంత్రితో సోమవారం ఎలాంటి భేటీ జరగడంలేదని స్పష్టం చేశారు. కిలోమీటర్ ప్రాతిపదికన అధికారుల ఒప్పందం కుదిరిన తర్వాతే మంత్రుల స్థాయి సమావేశం ఉంటుందని తమ వైఖరి స్పష్టం చేశారు. ఒప్పందం కుదిరే వరకు అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతాయని వివరించారు.
మార్చి చివరి వారంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఓవైపు అన్ లాక్ ప్రక్రియ అమలు జరుగుతున్నా కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు మోక్షం కలగలేదు. ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాలు తమ సరిహద్దు ప్రాంతాల వరకు సర్వీసులు తిప్పుతున్నాయి.