Chandrababu: దీని గురించి ఇదివరకే చాలాసార్లు చెప్పాను... ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్పింది: చంద్రబాబు
- తెలుగువన్.కామ్ ఎండీపై సీఐడీ కేసు
- సీఐడీని తప్పుబట్టిన హైకోర్టు
- కేసు రద్దు
- పోలీసులు బాధ్యతను గుర్తెరగాలన్న చంద్రబాబు
తెలుగువన్ మీడియా సంస్థ ఎండీ రవిశంకర్ పై సీఐడీ కేసు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ విభాగాన్ని తప్పుబట్టింది. అధికార పక్షం మెప్పు పొందేందుకే అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగా కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించింది. ఆపై తెలుగువన్.కామ్ ఎండీ రవిశంకర్ పై నమోదైన కేసును రద్దు చేసింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
తనపై జరిగిన అప్రజాస్వామిక కుట్రను న్యాయపోరాటంతో ధైర్యంగా తిప్పికొట్టారని, తద్వారా తెలుగువన్.కామ్ ఎండీ రవిశంకర్ పాత్రికేయస్వేచ్ఛను కాపాడారని చంద్రబాబు అభినందించారు. ఇప్పటికైనా పోలీసులు తమ స్వప్రయోజనాల కోసం పాలకులకు దాసోహం అనకుండా తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలని హితవు పలికారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
"పాలకులు శాశ్వతం కాదు, వ్యవస్థలే శాశ్వతమని ఇదివరకే చాలాసార్లు చెప్పాను... ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్పింది. పాలకుల మెప్పుకోసం ఖాకిస్టోక్రసీ ప్రదర్శిస్తున్నారని సీఐడీని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది అంటే పోలీసులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి" అని సూచించారు.