USA: హిందూ మహాసముద్రంలో చైనాను నిలువరించేందుకు మాల్దీవులతో అమెరికా ఒప్పందం
- హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు
- మాల్దీవులతో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం
- ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరుదేశాలు
గత కొంతకాలంగా హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరిగాయి. దీనిపై అమెరికా ఎప్పటినుంచో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అమెరికానే కాదు, హిందూ మహాసముద్రంపై గట్టి పట్టున్న భారత్ కూడా చైనా తీరును తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా... హిందూ మహాసముద్రంలోని మాల్దీవులతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబరు 10న ఫిలడెల్ఫియాలో జరిగిన ఓ సమావేశంలో అమెరికా, మాల్దీవుల ప్రభుత్వ వర్గాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
రక్షణ రంగంలో ప్రగాఢ సహకారం అందించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంతో హిందూ మహాసముద్రంలో శాంతి, భద్రత ఏర్పడతాయని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బలమైన భాగస్వామ్యాలు ఏర్పరచుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని వివరించింది.