Corona Virus: వ్యాక్సిన్ ట్రయల్స్ తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం: సీరమ్ ఇనిస్టిట్యూట్
- బ్రిటన్ లో తిరిగి ప్రారంభమైన వ్యాక్సిన్ ట్రయల్స్
- గత వారంలో వాలంటీర్ కు అస్వస్థతతో ఆగిన ప్రయోగాలు
- డీసీజీఐ అనుమతిస్తే ప్రారంభిస్తామన్న సీరమ్
ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ను లండన్ లో తిరిగి ప్రారంభించేందుకు అనుమతి లభించిన నేపథ్యంలో, ఇండియాలో వ్యాక్సిన్ ను పరిశీలిస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ సైతం అందుకు సిద్ధంగా ఉన్నామని, డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి కోసం వేచి చూస్తున్నామని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ కు అనారోగ్య సమస్యలు రావడంతో బ్రిటన్ లో ట్రయల్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఆ వెంటనే సీరమ్ ఇనిస్టిట్యూట్ కు డీసీజీఐ నుంచి నోటీసులు రావడంతో, ఇండియాలోనూ ట్రయల్స్ ఆపివేస్తున్నామని సంస్థ ప్రకటించింది. ఆపై లండన్ లో ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడంతో ఇండియాలోనూ తిరిగి పరీక్షలను పునఃప్రారంభించేందుకు కావాల్సిన అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని సంస్థ వెల్లడించింది.
బ్రిటన్ లో అస్వస్థతకు గురైన యువతి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆమెకు సంబంధించిన నివేదికను డీసీజీఐ కోరినట్టు తెలుస్తోంది. వీటిని అందించిన సీరమ్ ఇనిస్టిట్యూట్, తిరిగి పరీక్షలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని సంస్థ సీఈఓ అధార్ పూనావాలా, తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకూ తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారమంతా, వ్యాక్సిన్ సురక్షితమైనదేనని తెలుపుతోందని ఆయన అన్నారు. వైరస్ పరీక్షల విషయంలో తామేమీ తొందరపడటం లేదని, ఇటీవల జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు.