Rain: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాత్రంతా వర్షం... లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీరు!

Heavy Rain in Telugu States

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • అల్పపీడనానికి తోడైన ఉపరితల ఆవర్తనం
  • పలు ప్రాంతాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కలవడంతో, తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్గాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గత రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది.చాలా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరిపోగా, ఈ ఉదయం నిద్ర లేచి, బయటకు వచ్చిన ప్రజలు వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చౌరస్తాల్లో నీరు నిలవడంతో ట్రాఫిక్ కు సైతం అంతరాయాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట నిమ్స్, ఎస్సార్ నగర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది.

కాగా, ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా తమిళనాడు వరకూ ద్రోణి విస్తరించి వుందని, దాని ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ తదితర జిల్లాల్లో 2 నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.

  • Loading...

More Telugu News