Sajjala Ramakrishna Reddy: చెప్పింది చేయలేనోడు కాబట్టి అవన్నీ చంద్రబాబుకు అవసరం: సజ్జల
- సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం
- చెప్పుకోవడానికి తమ పార్టీకి ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయని వెల్లడి
- రోజుకు 30 గంటలు చెప్పుకున్నా తరగనంత మంచి ఉందన్న సజ్జల
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ పై అక్రమ కేసులు బనాయించినప్పుడు కూడా సజావుగా నడిచిన పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. జైల్లో ఉన్నప్పుడు ఆయన తల్లిగారు నాయకత్వం వహించినప్పుడు కూడా సాఫీగా నడిచిన పార్టీ తమదేనని, 23 మంది తమ ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నా, చెక్కుచెదరని పార్టీ తమదని ఉద్ఘాటించారు.
ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించి ఏడాదిన్నరగా పాలన సాగిస్తున్న పార్టీ తమదని, చెప్పుకోవడానికి ఎన్నో సానుకూలాంశాలు ఉన్న పార్టీ తమదని పేర్కొన్నారు. అలాంటి తమ పార్టీకి ఆలయాలపై దాడులు, రథాలు తగులబెట్టించుకోవాల్సిన అవసరం ఏముందని సజ్జల ప్రశ్నించారు.
"ఇలాంటివి చంద్రబాబునాయుడుకు అవసరం. ఎందుకంటే ఆయన చెప్పిందేమీ చేయలేదు. అసలేమీ చేయని వ్యక్తి. ఆయన పాలన కంటే గవర్నర్ పాలన మేలని భావించిన రోజులు కూడా ఉన్నాయి. అరటి తోటలు తగులబెట్టించడం, కులాల మధ్య చిచ్చుబెట్టించడం, రైళ్లు తగులబెట్టించడం, సినిమా డైరెక్టర్ ను తీసుకెళ్లి పుష్కరాల్లో షూటింగులు చేయించుకోవడం... ఇలాంటివన్నీ చంద్రబాబుకు అవసరం. మాకు ఇలాంటి వాటితో అవసరమే లేదు. రోజుకు 30 గంటలు చెప్పుకున్నా తరగనంత మంచిని జగన్ చేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న స్కీములు లెక్కలేనన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఎన్ని ఉన్నాయో మాకు కూడా గుర్తు రావు... ఇన్ని ఉండగా, ఏదో తగులబెట్టాల్సిన అవసరం మాకేముంది అంటూ సజ్జల వ్యాఖ్యానించారు.