GST: కేంద్రం 'అప్పు తీసుకోండి' అనగానే... ఓకే చెప్పేసిన 13 రాష్ట్రాలు!

13 States Ready to Take Loan from RBI

  • జీఎస్టీ బకాయిలు చెల్లించలేమని స్పష్టీకరణ
  • రెండు ఆప్షన్స్ ఉంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
  • ఆర్బీఐ నుంచి అప్పు తీసుకునేందుకు రాష్ట్రాలు సిద్ధం
  • జాబితాలో ఏపీ, బీహార్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాలు
  • ఇంకా ఏ విషయమూ వెల్లడించని తెలంగాణ

కరోనా వైరస్ మహమ్మారి దేవుడు సృష్టించిన విపత్తని, అన్ని రంగాలూ కుదేలైన సమయంలో, జీఎస్టీ బకాయిలను చెల్లించే పరిస్థితి లేదని రెండు వారాల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో నిధులు అవసరమైతే ఆర్బీఐ నుంచి రుణం స్వీకరించాలని ఆమె స్పష్టం చేయడంతో, 13 రాష్ట్రాలు అందుకు అంగీకరించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్టాలు రుణం తీసుకునేందుకు అంగీకరించాయి.

ఇదే సమయంలో గోవా, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మరో రెండు రోజుల్లో తమ అభిప్రాయం చెబుతామని స్పష్టం చేయగా, మిగతా రాష్ట్రాలు ఇంకా స్పందించలేదు. గత వారం సమావేశమైన జీఎస్టీ కమిటీ, రాష్ట్రాల ముందు రెండు ఆప్షన్స్ ఉంచింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలకు సమానమైన మొత్తాన్ని ఆర్బీఐ నుంచి రుణంగా తీసుకోవచ్చని, లేకుంటే, మార్కెట్ నుంచి బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించుకోవచ్చని పేర్కొంది. దీంతో, మణిపూర్ మాత్రం రెండో ఆప్షన్ ను తీసుకుంది.

మొత్తం రూ. 97 వేల కోట్ల మేరకు జీఎస్టీ బకాయిలు వసూలు కాకపోగా, కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకూ రూ.2.35 లక్షల కోట్లు రావాల్సి వుంది. కరోనా కారణంగా బకాయిలు వసూలు కాకపోవడంతో, వచ్చిన నిధులు కరోనా చికిత్స నిమిత్తం ఖర్చవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అయితే, జీఎస్టీ కింద తమ రాష్ట్రాల నుంచి చెల్లించిన పన్నుల్లో ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడంపై, చాలా రాష్ట్రాలు ఆగ్రహంతో ఉన్నాయి.

వెంటనే బకాయిలు ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ ను తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కోరాయి. గత నెల 27న జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి 'కరోనా దైవ ఘటన' అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా పలు రాష్ట్రాలు, విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. తమకు చేతగాక, నెపాన్ని దేవుడిపై మోపుతున్నారని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది కూడా. అయితే, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఇప్పటికిప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తామన్న కేంద్రం, రెండు ఆప్షన్స్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News