Vellampalli Srinivasa Rao: ఫిబ్రవరి లోపు అంతర్వేది రథం పూర్తి చేయాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు
- వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేదిలో కల్యాణోత్సవాలు
- ఏడు అంతస్తులతో రథం నిర్మాణం
- 41 అడుగుల ఎత్తుతో రథం డిజైన్ సిద్ధం
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఇటీవల శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అటు సీఎం జగన్ కాలిపోయిన రథం స్థానంలో కొత్త రథం కోసం రూ.95 లక్షలు మంజూరు చేశారు.
దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందిస్తూ, ఫిబ్రవరి లోగా అంతర్వేదిలో రథం నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. రథంలో ఏడు అంతస్తులు ఉండే విధంగా నిర్మాణం చేపడుతున్నారని, ఈ రథానికి ఆరు చక్రాలు ఉంటాయని వెల్లడించారు. అయితే రథం ఆకృతిలో ఎలాంటి మార్పులు లేకుండా సిద్ధం చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు. శిఖరంతో కలిపి మొత్తం 41 అడుగులు ఎత్తు వచ్చేలా నూతన రథం డిజైన్ సిద్ధమైందని అధికారులు తెలిపారని మంత్రి వెల్లంపల్లి ట్విట్టర్ లో తెలిపారు.
కాగా, రథాన్ని ఉంచే షెడ్డును కూడా పునరుద్ధరించాలని, దీనికి ఇకపై ఇనుప షట్టర్ అమర్చాలని నిర్ణయించారు. అటు ప్రభుత్వం నూతన రథం కోసం రూ.95 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కాలిపోయిన పాత రథానికి రూ.84 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ బీమా సొమ్ము వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు జరగాల్సి ఉండడంతో, బీమా సొమ్ము వచ్చేంతవరకు ఆగకుండా ప్రభుత్వ నిధులతోనే రథం నిర్మాణం చేపట్టాలని అనుకుంటున్నారు.