Daggubati Purandeswari: వెల్లంపల్లి బీజేపీలో ఉన్న సమయంలో ధార్మిక సంస్థలతో కలిసి పోరాటం చేయలేదా?: పురందేశ్వరి
- మతరాజకీయాలు చేస్తే సహించేదిలేదన్న వెల్లంపల్లి
- వెల్లంపల్లి వ్యాఖ్యలపై పురందేశ్వరి అభ్యంతరం
- ఇతరులపైకి తప్పులు నెట్టేస్తున్నారని విమర్శలు
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై హిందూ సంఘాలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. బీజేపీ ఆందోళనలకు పిలుపునివ్వగా, ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మతరాజకీయాలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.
వెల్లంపల్లి గతంలో బీజేపీలో ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలని, వెల్లంపల్లి బీజేపీలో ఉన్న సమయంలో బీజేపీ ఇతర ధార్మిక సంస్థలతో కలిసి పోరాటాలు సాగించిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. తమ తప్పులను ఇతరులపైకి నెట్టి, తాము తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుందని అన్నారు.
ఏ పార్టీలో లేని విధంగా బీజేపీలో ధార్మిక విభాగం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, దేవతా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆలయాల పరిరక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చెప్పాలని అన్నారు.