Jeevan Reddy: అధికారం లేని వీఆర్వోలు అవినీతిపరులయ్యారా?: సర్కారుపై జీవన్ రెడ్డి విసుర్లు
- వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నూతన చట్టం అన్న జీవన్ రెడ్డి
- బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఆమోదించుకున్నారని ఆరోపణ
- ఏ ఒక్కరైతు అయినా పాలాభిషేకం చేశాడా అని వ్యాఖ్యలు
తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తుండడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నూతన రెవెన్యూ చట్టం కారణంగా వీఆర్వో వ్యవస్థ రద్దవుతుండడం తెలిసిందే. దీనిపై జీవన్ రెడ్డి స్పందిస్తూ, అధికారంలేని వీఆర్వోలను అవినీతి పరులు అంటూ ముద్రవేశారని, ఎమ్మార్వోలు, ఆర్డీవోలందరూ నీతిమంతులు అని చెబుతున్నారని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు బాగా పనిచేస్తున్నారని గతంలో నెల జీతం బోనస్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
కేసీఆర్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్త రెవెన్యూ బిల్లు తీసుకువస్తున్నారని విమర్శించారు. ఈ కొత్త రెవెన్యూ చట్టానికి టీఆర్ఎస్ పార్టీ నేతలు తప్ప ఏ ఒక్క రైతు కూడా పాలాభిషేకాలు చేయడంలేదని అన్నారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఆమోదింపచేసుకున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక భూ సర్వే చేసేందుకు కేంద్రం రూ.200 కోట్లు కేటాయించిందని అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే భూ సర్వే చేశాయని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆలస్యంగా చేస్తున్నారని తెలిపారు. కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి మూడేళ్లు అవుతోందని, ఇప్పటికీ సర్వే చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.