Politicians: ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Supreme Court comments on Politicians cases

  • సుప్రీంకు నివేదికను అందించిన అమికస్ క్యూరీ
  • కేసులను ట్రయల్ కోర్టులకు ఇవ్వాలన్న ధర్మాసనం
  • రేపటిలోగా కీలక ఆదేశాలను జారీ చేస్తామని వ్యాఖ్య

మన దేశంలో వేలాది మంది ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నాయనే విషయం తెలిసిందే. కొందరిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. మరి కొందరిపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తులు జరుగుతున్నాయి. అయితే, ఏళ్లు గడుస్తున్నా ఈ కేసుల విచారణ కొలిక్కి రాకపోవడంతో, ప్రజాప్రతినిధులు ధైర్యంగా వారి పని వారు చేసుకుపోతున్నారు.

 ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలనే పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సాయపడడానికి అమికస్ క్యూరీగా విజయ్ హన్సారియాని నియమించగా ఆయన ఈరోజు సుప్రీంకు నివేదిక అందించారు. దేశంలో ఇప్పటికే ప్రజాప్రతినిధులు, మాజీలకు సంబంధించి 4,400 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తన నివేదికలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నివేదికను తయారు చేసినట్టు  తెలిపారు.

తెలంగాణలో 118 కేసులు పెండింగ్ లో ఉన్నాయని... ఒక్క హైదరాబాదులోనే ప్రజాప్రతినిధులపై 13 సీబీఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయని అమికస్ క్యూరీ వెల్లడించారు. వీరిలో ఒక ఎమ్మెల్యేకు జీవితఖైదు విధించే స్థాయి కేసు కూడా విచారణలో ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారని... హైదరాబాదులో సీబీఐ, ఈడీ కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర విచారణకు జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సూచించారు.

ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ, కొన్ని రాష్ట్రాల్లో రెండు, మూడు కేసులు మాత్రమే ఉంటాయని... అలాంటి వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల హైకోర్టులకు కొన్ని ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కొన్ని కేసుల్లో విచారణ ఇంకా ప్రారంభం కాలేదని చెప్పింది. ఈ కేసులను విచారించేందుకు ట్రయల్ కోర్టులకు అనుమతిని ఇవ్వాలని వ్యాఖ్యానించింది.

కర్ణాటక వంటి హైకోర్టుల్లో అవినీతి నిరోధక చట్టం కింద కేసులు ఉన్నాయని... తెలంగాణలో ప్రజాప్రతినిధులపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నాయని... వీటిలో కొన్ని కేసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించిందని హన్సారియా తెలిపారు. కొన్ని కేసుల్లో ట్రయల్స్ ప్రారంభం కాలేదని, మరికొన్ని కేసుల్లో ఛార్జిషీట్లు ఇంకా వేయలేదని చెప్పారు.

ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, కేసు విచారణలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని... పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అపాయింట్ చేయకపోవడం, ఛార్జ్ షీట్లు ఫైల్ చేయకపోవడం, సాక్షులను పిలవకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఒకే స్పెషల్ కోర్టు ఉంటే నిర్ణీత గడువులోగా దర్యాప్తును ముగించడం కష్టమని వ్యాఖ్యానించింది.
 
ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ మెహతా మాట్లాడుతూ, ఒక్కో ప్రత్యేక కోర్టు ఎన్ని కేసులు విచారించాలనే విషయాన్ని సుప్రీం నిర్ణయిస్తే బాగుంటుందని చెప్పారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక్కో స్పెషల్ కోర్టుకు ఎన్ని కేసులు ఇవ్వాలనే విషయాన్ని ఆయా హైకోర్టుల చీఫ్ జస్టిస్ లు నిర్ణయించినా బాగుంటుందని అన్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం రాష్ట్రాలకు కేంద్రం నిధులను విడుదల చేసిందని... అయితే అనేక రాష్ట్రాలు ఇంత వరకూ యూసీలను పంపలేదని చెప్పారు. జీవితఖైదు శిక్ష పడే కేసులు, అవినీతి నిరోధక చట్టం కిందకు వచ్చే కేసులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

ఈ నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రత్యేక కోర్టులు, మౌలికవసతుల కల్పనకు రెండు నెలల సమయం ఇవ్వాలని కోరారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, హైకోర్టులు, ట్రయల్ కోర్టులకు రేపటిలోగా కొన్ని ఆదేశాలను జారీ చేస్తామని  తెలిపింది. మరోవైపు... ప్రజాప్రతినిధులు దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం వారిని నిషేధించాలనే పిటిషనర్ విన్నపంపై స్పందిస్తూ, ఈ అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని చెప్పింది.

  • Loading...

More Telugu News