Supreme Court: టీవీ మీడియాను నియంత్రించే ముందు డిజిటల్ మీడియా సంగతి చూడండి: సుప్రీంకోర్టును కోరిన కేంద్రం

Center Tells Top Court To Look Digital Media Regulation First

  • టీవీ చానెళ్లపై మరింత నియంత్రణ ఉండాలన్న సుప్రీంకోర్టు
  • అత్యంత ప్రభావాన్ని చూపుతున్నది డిజిటల్ మీడియానే
  • ముందుగా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్రం అఫిడవిట్

ఎలక్ట్రానిక్ మీడియాను, టీవీ చానెళ్లను నియంత్రించాలని చూసే ముందు డిజిటల్ మీడియాపైనా తప్పనిసరిగా దృష్టి సారించాలని, ప్రస్తుత కాలంలో డిజిటల్ మీడియా ప్రభావమే చాలా అధికంగా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. నిబంధనలను విధించేముందు డిజిటల్ మీడియానూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

"డిజిటల్ మీడియా వేగంగా ప్రజల్లోకి వెళుతోంది. వాట్స్ యాప్, ఫేస్ బుక్ వంటి యాప్స్ వచ్చిన తరువాత, ఏ విషయమైనా శరవేగంగా వైరల్ అవుతోంది" అంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. నియంత్రించాలని భావిస్తే, ముందుగా డిజిటల్ మీడియా సంగతి చూడాలని కోరింది.

ఇప్పటికే దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలపై విధివిధానాలు అమలవుతున్నాయని, నియంత్రణా సంస్థలు పత్రికలు, చానెళ్ల వాక్ స్వాతంత్ర్యపు హక్కు, బాధ్యతాయుత జర్నలిజం తదితరాలను సమతుల్యం చేసేందుకు కృషి చేస్తున్నాయని కేంద్రం ఈ సందర్భంగా పేర్కొంది. డిజిటల్ మీడియా నియంత్రణకు విధివిధానాలను రూపొందించేందుకు ఓ కమిటీని నియమించాలని సూచించింది.

కాగా, ప్రైవేటు చానెల్ 'సుదర్శన్ టీవీ'లో ప్రసారం అవుతున్న యూపీఎస్సీ జీహాద్ అనే కార్యక్రమంలో ముస్లింలను టార్గెట్ చేస్తూ, వ్యాఖ్యలు రాగా, ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలను ప్రసారం చేయరాదని అంటూ, దీని ఎపిసోడ్ లను టెలికాస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ దశలో ఉండగా, కేంద్రం డిజిటల్ మీడియాపై నియంత్రణ ఉండాలంటూ అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News