Ayyanna Patrudu: మీడియా సమావేశం మధ్యలో ఏసీబీ కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన అయ్యన్నపాత్రుడు

TDP leader Ayyanna Patrudu phone call to ACB Call Center in the middle of press meet

  • మంత్రి జయరాం, ఆయన తనయుడు ఈశ్వర్ పై ఆరోపణలు
  • ఓ ముద్దాయి ఈశ్వర్ కు బెంజ్ కారు ఇచ్చాడన్న అయ్యన్న
  • అది పుట్టినరోజు కానుక కాదు లంచం అని వివరణ

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖలో ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం జరుగుతుండగా మధ్యలో ఏసీబీ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్ లపై ఫిర్యాదు చేశారు. ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సంస్థలో అవినీతి జరిగిందని, అందులో మంత్రి జయరాం, ఆయన తనయుడు ఈశ్వర్ ల ప్రమేయం ఉందని ఆరోపించారు.

ఈ కుంభకోణంలో గుమ్మనూరు ఈశ్వర్ కు బెంజ్ కారు లంచంగా ఇచ్చారని వెల్లడించారు. అవినీతి జరిగితే ఏసీబీ కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోందని, ఇప్పుడీ ఈఎస్ఐ స్కాంలోనూ పరిష్కారం వస్తుందని భావిస్తున్నానని అయ్యన్న పేర్కొన్నారు.

అంతకుముందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈఎస్ఐ స్కాంలో ఏ14 ముద్దాయిగా ఉన్న తెలకపల్లి కార్తీక్ అనే వ్యక్తి మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ కు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారని తెలిపారు. మంత్రికి బినామీ కాబట్టే సదరు ఏ14 ముద్దాయి ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చారని, మంత్రి కుమారుడి బర్త్ డే సందర్భంగా ఇచ్చింది కానుక కాదని లంచం అని ఆరోపించారు. ఆ ఏ14 ముద్దాయికి మంత్రి తనయుడికి ఏంటి సంబంధం అని అయ్యన్న ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరపాలని, ప్రభుత్వం వేసే కమిటీకి దీనిపై ఆధారాలు అందించడానికి తాము సిద్ధమేనని అన్నారు. ఇంతకుముందు ఎలాంటి ఆధారాలు లేకపోయినా టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని, అన్ని ఆధారాలు ఉన్న పరిస్థితుల్లో మంత్రి గుమ్మనూరు జయరాంను పదవిలో కొనసాగించడం తగదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News