Harsimrat Kour: చేస్తున్నదంతా 'జియో'నే... ఓ రైతు అప్పుడే చెప్పాడు: కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్
- వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమే
- పంటల ధరల నియంత్రణకు జియో సహకారం
- మొత్తం కార్పొరేట్ దమన నీతే
- ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో హర్ సిమ్రత్ బాదల్
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ నియంత్రణ బిల్లులు రైతులకు వ్యతిరేకమంటూ, రాజీనామా చేసిన కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన సంస్థ రిలయన్స్ జియోలను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు 'ఎన్డీటీవీ'కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తమ వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులు పీల్చిపిప్పి చేస్తారేమోనన్న భయంతో మన రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
రిలయన్స్ జియో వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయిందని తనతో ఓ నిర్భాగ్య రైతు వాపోయాడని హర్ సిమ్రత్ వ్యాఖ్యానించారు. జియో రాకతో, వ్యవసాయ రంగంలో ప్రైవేటు పాత్ర పెరిగిపోయిందని అన్నారు. అందుకు ఉదాహరణలను కూడా తాను వెల్లడిస్తానని చెబుతూ, "ఓ రైతు తన మాటల్లో ఇలా అన్నాడు. జియో రాగానే ఉచిత ఫోన్లను ఇచ్చింది. అంతా వాటిపై ఆధారపడగానే పోటీ అనేది తుడిచిపెట్టుకుని పోయింది. ఆ తర్వాత రేట్లను పెంచేశారు. ఇదే ఇప్పటి కార్పొరేట్ దమన నీతి" అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను ఎన్నోమార్లు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి, రైతుల సమస్యలను వినాలని, వారితో చర్చించిన మీదటే, ఆర్డినెన్స్ లు, బిల్లుల విషయంలో ముందుకు వెళ్లాలని సూచించానని, అయినా, వారు వినకుండా లోక్ సభ ముందుకు గురువారం నాడు బిల్లులను తెచ్చారని విమర్శలు గుప్పించారు. ఈ బిల్లులు రైతు వ్యతిరేకమని ఎంతగా విన్నవించినా, కేంద్రం వినలేదని చెప్పిన ఆమె, ప్రజల మద్దతు లేకుండా ఈ బిల్లులు ఎలా అమలవుతాయో చూస్తామని అన్నారు.
ప్రస్తుతానికి తన గొంతుక దేశవ్యాప్తంగా వినిపించడం లేదని, కానీ త్వరలోనే విషయం అందరు రైతులకు తెలుస్తుందని వ్యాఖ్యానించిన హర్ సిమ్రత్, రాజ్యసభలో బిల్లులను అడ్డుకుంటామని, అందుకోసం వివిధ పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాల రైతుల మద్దతు కూడగట్టుకుంటామని అన్నారు. ఈ బిల్లులు జూన్ లోనే ఆర్డినెన్స్ ల రూపంలో అమలులోకి వచ్చాయని గుర్తు చేసిన ఆమె, వాటిని పలు రాష్ట్రాల రైతులు వ్యతిరేకించారని గుర్తు చేశారు.