Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు విడుదల చేయాలని ఏపీ సీఎం లేఖ రాశారు: కేంద్రం
- విజయసాయి ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక జవాబు
- ఏపీ సమర్పించిన బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదని వెల్లడి
- ఆగస్టు 25న సీఎం జగన్ లేఖ రాశారన్న కేంద్ర మంత్రి
పోలవరం ప్రాజెక్టు వ్యయంపై ఏపీ ప్రభుత్వం బిల్లులు సమర్పించిందని కేంద్రం వెల్లడించింది. అయితే, ఏపీ ప్రభుత్వం సమర్పించిన బిల్లుల్లో రూ.760 కోట్ల ఖర్చులకు అర్హత లేదని కేంద్రం స్పష్టం చేసింది. మరో రూ.479 కోట్లకు బిల్లులు అందలేదని కేంద్రం వివరించింది. 2014 నుంచి రూ.8,614 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేశామని తెలిపింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మొత్తం రూ,12,506 కోట్ల మేర పనులు చేశామని ఏపీ ప్రభుత్వం తెలిపిందని, 2014 ఏప్రిల్ నుంచి 2020 జూలై వరకు ఈ పనులు చేసినట్టు ఏపీ తెలిపిందని కేంద్రం పేర్కొంది. పోలవరం 71.46 శాతం పూర్తయిందని ఏపీ తెలిపిందని, పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు విడుదల చేయాలని ఏపీ సీఎం లేఖ రాశారని వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 25న సీఎం జగన్ ఈ లేఖ రాశారని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు.
అయితే, పనుల పురోగతి, బిల్లుల తనిఖీ, పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫారసుల మేరకే నిధుల విడుదల ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.