Statue: సొంత విగ్రహం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసిన చెత్త ఏరుకునే వ్యక్తి!

Ragpicker in Tamilnadu set to unveil his own statue

  • కుటుంబ వివాదంతో ఊరి నుంచి వచ్చేసిన వ్యక్తి
  • పాత సీసాలు ఏరుకుంటూ జీవనం
  • రెండు ప్లాట్లు కొని స్వీయ విగ్రహం ఏర్పాటు
  • త్వరలోనే విగ్రహావిష్కరణ

తమిళనాడులోని సేలం జిల్లా అత్తనుర్పట్టి గ్రామంలో నివసించే నల్లతంబి (60) ఓ విచిత్రమైన వ్యక్తి. అయినవాళ్లందరినీ, సొంత ఊరినీ వదిలేసి అత్తనుర్పట్టి గ్రామంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. యువకుడిగా ఉన్నప్పటి నుంచి నల్లతంబికి ఓ కల ఉండేది. సొంతంగా విగ్రహం ఏర్పాటు చేయించుకోవాలని, తన పేరు మార్మోగిపోవాలని అనుకునేవాడు. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. అందుకోసం రూ.10 లక్షలు ఖర్చు చేశాడు.

సేలం జిల్లాలోని ఆనైమేడు నల్లతంబి స్వస్థలం. తాపీమేస్త్రిగా పనిచేసేవాడు. ఇప్పటికీ అక్కడ అతని భార్య, పిల్లలు ఉన్నారు. ఓ కుటుంబ వివాదంతో 20 ఏళ్ల కిందట భార్య, బిడ్డలను వదిలేసి వచ్చాడు. తాపీమేస్త్రిగా తాను పనిచేసిన కాలంలో దాచుకున్న సొమ్ముతో పాటు, అత్తనుర్పట్టి గ్రామం వచ్చాక చెత్త ఏరుకుంటూ సంపాదించిన డబ్బుతో స్వీయ విగ్రహ ఏర్పాటుకు పూనుకున్నాడు. వళప్పాడి-బేలూరు రహదారిలో రెండు ప్లాట్లు కొనుగోలు చేశాడు. నిలువెత్తు విగ్రహం తయారుచేయాలంటూ శిల్పికి రూ.1 లక్ష ఇచ్చాడు.

ఏర్పాట్లన్నీ సకాలంలో పూర్తికావడంతో గత ఆదివారం తాను కొనుక్కున్న స్థలంలో తన విగ్రహాన్ని నిలబెట్టాడు. దారినపోయేవాళ్లని ఈ విగ్రహం విపరీతంగా ఆకర్షిస్తోంది. ఎవరిదా విగ్రహం అని ఆరా తీస్తే పాత ప్లాస్టిక్ సీసాలు ఏరుకునే నల్లతంబిదని తెలియడంతో వాళ్లలో ఆసక్తి మరింత అధికమవుతోంది. ఇది ఈ నోటా ఆ నోటా పాకి ఆ ప్రాంతమంతా తెలియడంతో పెద్ద ఎత్తున జనాలు నల్లతంబి విగ్రహాన్ని చూడ్డానికి రాసాగారు. త్వరలోనే తన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఓ ఘనమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నల్లతంబి సన్నాహాలు చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News