Chandrababu: టీడీపీ ద్రోహులకు రాజకీయ సమాధి తప్పదు... వాసుపల్లి వ్యవహారంపై చంద్రబాబు స్పందన
- కుమారులతో సహా సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి
- వాసుపల్లి కుమారులు వైసీపీలో చేరిక
- పార్టీకి ద్రోహం చేయడం దారుణమని వ్యాఖ్యలు
ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో విశాఖ (దక్షిణం) టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ తన ఇద్దరు కుమారులతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వాసుపల్లి కుమారులు సాకేత్, సూర్య సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు, సీఎం జగన్ గట్స్ ఉన్న నేత అంటూ ఎమ్మెల్యే వాసుపల్లి ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా స్పందించారు. టీడీపీ ద్రోహులకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. సొంతలాభం చూసుకుని పార్టీకి ద్రోహం తలపెడితే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
అయినా, ద్రోహులకు పార్టీలో స్థానం లేదని, నాయకులు వస్తారు, పోతారని, కార్యకర్తలే శాశ్వతమని పునరుద్ఘాటించారు. ఒకరిద్దరు పార్టీని వీడితే వచ్చే నష్టమేమీ లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీకి అండగా కార్యకర్తలు ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.