Corona Virus: ఈ కరోనా మహమ్మారి నాశనం ఎలా?.. దీనికి రెండే మార్గాలు ఉన్నాయంటున్న నిపుణులు!
- ప్రపంచాన్ని కరోనా పట్టుకుని 10 నెలలు
- ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల మందికి సోకిన వైరస్
- వ్యాక్సిన్ వచ్చేంత వరకూ భౌతిక దూరమే రక్ష
- ప్రజలు బయటకు వస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
- క్రమంగా వైరస్ మాయం అవుతుందంటున్న నిపుణులు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టుకుని దాదాపు 10 నెలలు కావస్తోంది. చైనాలోని వూహాన్ లో డిసెంబర్ 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి, 3 కోట్ల మందికి పైగా ప్రజలకు సోకింది. ఈ భయంకర వైరస్ కారణంగా ఇప్పటివరకూ 9.56 లక్షల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. వైరస్ ను అడ్డుకునేందుకు ఎన్నో దేశాలు వ్యాక్సిన్ ను తయారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు ప్రజలందరి మనసులనూ తొలిచేస్తున్న ప్రశ్న ఒకే ఒక్కటి. ఈ మహమ్మారి నాశనం ఎలా?
ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. మానవ చరిత్రలో ఎన్నో మహమ్మారి రోగాలు వచ్చాయి. ఈ మహమ్మారులన్నీ క్రమంగా దూరమైపోయాయి. కరోనా కూడా మాయం కావాలంటే, రెండే మార్గాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వాటిల్లో ఒకటి వైద్యపరంగా వ్యాక్సిన్ ను కనుగొనడం ద్వారా వైరస్ ను అంతం చేయడం ఒకటైతే, రెండోది సామాజికంగా జాగ్రత్తలతో వైరస్ ను నాశనం చేయడమే. మొదటిది వైద్య రంగానికి సవాలుగా నిలిచిన ప్రశ్నకాగా, రెండోది ప్రజల్లో వచ్చే మార్పుతోనే సాధ్యమన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం.
ప్రస్తుతం ప్రపంచంలో 165 వ్యాక్సిన్ కాండిడేట్లు, పలు దశల ట్రయల్స్ లో ఉన్నాయి. కొన్ని ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో, కొన్ని క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వివిధ దశల్లో ఉన్నాయి. వీటిల్లో 33 వ్యాక్సిన్లు కీలకమైన మానవ ప్రయోగాల దశకు చేరాయి. ఇక, వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో పనిచేయకపోయినా ఇబ్బందిలేదని, 50 నుంచి 60 శాతం పనిచేసే వ్యాక్సిన్ వచ్చినా అంగీకరించ వచ్చని యూఎస్ అంటురోగాల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు. కనీసం 75 శాతం పనిచేసే వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారని అన్నారు.
ఇక ఈ వ్యాక్సిన్ల ప్రాథమిక సమాచారాన్ని పరిశీలిస్తే, చాలా వరకూ వ్యాక్సిన్లు సంతృప్తికర ఫలితాలనే ఇస్తున్నాయి. వచ్చే సంవత్సరం తొలి త్రైమాసికానికి కరోనా వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకునే వ్యాక్సిన్ బయటకు వస్తుందని అంచనా. ఒకసారి వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చి, భారీ ఎత్తున ఉత్పత్తి జరిగితే, ఆపై క్రమంగా కొత్త కేసుల సంఖ్య, మరణాల రేటు దానంతట అదే తగ్గిపోతుంది. అది మహమ్మారి అంతమవుతుంది.
ఇక వ్యాక్సిన్ రాకపోతే... దాదాపు వందేళ్ల క్రితం ప్రపంచాన్ని పీడించిన స్పానిష్ ఫ్లూను ఓసారి గుర్తు చేసుకుందాం. అప్పట్లో ఈ వైరస్ 50 కోట్ల మందికి సోకడంతో పాటు, ఒక శాతం ప్రపంచ జనాభాను కబళించింది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత దానంతట అదే మాయమైపోయింది. అంటే, ప్రజల్లో స్పానిష్ ఫ్లూ వైరస్ అడ్డుకునే రోగ నిరోధక శక్తి పెరగడానికి రెండేళ్లు పట్టింది. కరోనా విషయంలోనూ ఇలాగే జరగాలంటే, ఇళ్లల్లో ఉన్నవారంతా బయటకు రావాలి. దైనందిన జీవితం తిరిగి గాడిలో పడితే, ప్రజల్లో క్రమంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఆరోగ్య నిపుణుల అంచనా ప్రకారం, ఇప్పటికిప్పుడు ఈ వైరస్ ను అంతం చేసే శక్తి కనిపించడం లేదు. ఇదే సమయంలో వైరస్ మరింతమందికి సోకకుండా నియంత్రించేందుకు ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో మొట్టమొదటిది భౌతిక దూరం పాటించడం. ప్రజలు ఒకరికి ఒకరు దూరంగా మసలుతుంటే, వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది. వైరస్ లింక్ ను కట్ చేయగలిగితే, అది మరొకరికి సోకే అవకాశాలు ఉండవు. అయితే, దీనికి చాలా సమయం పడుతుంది. ఏదిఏమైనా ప్రభావవంతమైన వ్యాక్సిన్ వస్తే, వైరస్ మరింత త్వరగా కనుమరుగవుతుందన్నది మాత్రం వాస్తవం.