TRS: నిగ్రహం కోల్పోయిన ఆందోల్ ఎమ్మెల్యే.. గ్రామస్థుల నిలదీత!
- తనకు సభ్యత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించిన కనకరాజు
- చేయి చేసుకోవడంతో మూకుమ్మడిగా తరలివచ్చిన గ్రామస్థులు
- సముదాయించాను తప్ప చేయి చేసుకోలేదన్న ఎమ్మెల్యే
పార్టీలో తనకు సభ్యత్వం ఇవ్వడం లేదని నిలదీసిన ఓ కార్యకర్తపై చేయిచేసుకున్న ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్.. ప్రజల నిలదీతతో క్షమాపణ చెప్పారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం వెంకట్రావుపేటలో నిన్న జరిగిందీ ఘటన. గ్రామంలోని కార్యకర్తలను కలుసుకునేందుకు ఎమ్మెల్యే వెంకట్రావుపేట వెళ్లారు. కార్యకర్తలతో సమావేశం జరుగుతుండగా కనకరాజు అనే వ్యక్తి తనకు పార్టీలో సభ్యత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే కనకరాజుపై చేయి చేసుకున్నారు.
విషయం తెలిసిన గ్రామస్థులు పెద్ద ఎత్తున సమావేశం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. తమ ఊరికి వచ్చి తమ పిల్లాడిపైనే చేయి చేసుకుంటావా? అని ప్రశ్నించారు. అంతటితో ఆగక ఎమ్మెల్యేను ఘెరావ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వారికి క్షమాపణ చెప్పి గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే వివరణ ఇస్తూ.. కనకరాజుపై తాను చేయి చేసుకోలేదని, సమావేశంలో గొడవ వద్దంటూ భుజంపై చేయి వేసి సముదాయించానని వివరణ ఇచ్చారు.