harsha vardhan: అడ్వాన్స్‌డ్ ట్రయల్స్ దశల్లో మూడు భారతీయ వ్యాక్సిన్లు: పార్లమెంటుకు తెలిపిన కేంద్రం
- భారత్‌లో వ్యాక్సిన్ తయారీలో 30 ఫార్మా సంస్థల కృషి
- కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం
- నాలుగు వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే రేసులో ముందు వరసలో ఉన్న భారత్ ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పార్లమెంటుకు వివరాలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో 145 సంస్థలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.
వాటిలో ఇప్పటివరకు 35 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని హర్షవర్ధన్ చెప్పారు. భారత్‌లో వ్యాక్సిన్ తయారీలో 30 ఫార్మా సంస్థలు కృషి చేస్తున్నాయని, ఆ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందజేస్తున్నామని తెలిపారు. వాటిలో మూడు అడ్వాన్స్‌డ్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయని చెప్పారు.
మరో నాలుగు వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని వివరించారు. వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో పాటు అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిలా వంటి సంస్థల కృషిని, వారు సాధిస్తోన్న విజయాలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని ఆయన చెప్పారు.