Somireddy Chandra Mohan Reddy: ఈ మాట్లాడేవాళ్లందరికీ దమ్ముంటే చొక్కాతో అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లమనండి చూద్దాం!: సోమిరెడ్డి
- డిక్లరేషన్ అంశంపై సోమిరెడ్డి వ్యాఖ్యలు
- ఆచారాలు ఉల్లంఘించడానికి మీరెవరంటూ ఆగ్రహం
- సీఎం జగన్ ఆచారాలు గౌరవించాలని హితవు
ఏపీలో ఇటీవల ఆలయాలపై దాడులు జరుగుతుండడం, తిరుమల డిక్లరేషన్ అంశం వివాదాస్పదం కావడం వంటి అంశాలపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంజనేయస్వామి విగ్రహానికి చేయి విరిగితే నష్టమేంటి? దుర్గ గుడిలో రథంపై ఉండే విగ్రహాలు పోతే డబ్బులు పెట్టి తెస్తాము?, తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిన అవసరమేంటి? అంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, ఇవన్నీ దురదృష్టకరమైన పరిణామాలని సోమిరెడ్డి అన్నారు.
"ఒకరి మతాన్ని ఒకరు గౌరవించడంలో తప్పులేదు. డిక్లరేషన్ అనేది తిరుమలలో శతాబ్దాల నాటి సంప్రదాయం. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, అప్పట్లో గవర్నర్ కేసీ అబ్రహాం తిరుమల వస్తే డిక్లరేషన్ పై సంతకాలు చేశారు. సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకాలు చేయలేదంటే... అప్పుడేం జరిగిందో! అయినా అది ఉల్లంఘనే. ఇప్పుడు కూడా ఉల్లంఘిస్తామంటే కుదరదు.
ఇదేమీ కేవలం ఆంధ్ర రాష్ట్రానికే పరిమితమైన ఆలయం కాదు. ప్రపంచంలో వాటికన్ కంటే మించిన పుణ్యక్షేత్రం. త్రివేండ్రంలో ఉండే అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లాలంటే చొక్కా తీసేసి వెళ్లాలి. ఈ మాట్లాడేవాళ్లందరినీ చొక్కాతో అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లమనండి చూద్దాం. ఎంత పెద్దవాళ్లయినా అక్కడికి చొక్కాతో వెళ్లలేరు. గురువాయూర్ క్షేత్రంలోనూ అంతే.
మక్కా వెళ్లాలంటే నేను ముస్లింని అని డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలి. అది వాళ్ల ఆచారం. ఆచారాలను ఉల్లంఘించడానికి మీరెవరు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ఏడుకొండల వాడి ఆశీస్సులు కావాలంటే మాత్రం అక్కడి ఆచారాలను మంచి మనసుతో గౌరవించక తప్పదని సోమిరెడ్డి స్పష్టం చేశారు.