L Ramana: పార్టీ అధ్యక్షుడిని మార్చాలంటూ చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతల లేఖ
- తెలంగాణలో దిగజారుతున్న టీడీపీ పరిస్థితి
- ఏడేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ
- రమణను మారిస్తే పార్టీ బలపడే అవకాశం ఉందన్న పార్టీ సీనియర్లు
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నాయకత్వాన్ని పార్టీలోని పలువురు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. గత ఏడేళ్లుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ కొనసాగుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ బలహీనంగా తయారవుతోంది. 2014లో తెలంగాణలో టీడీపీకి 15 సీట్లు కాగా, 2019లో 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ సీనియర్లు లేఖ రాశారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కూడా నెలకొందని లేఖలో పార్టీ సీనియర్లు పేర్కొన్నారు. పార్టీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోందని చెప్పారు. ఏపీలో పార్టీ అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో... తెలంగాణలో కూడా అధ్యక్ష బాధ్యతలను కొత్తవారికి అప్పగించాలని కోరారు. అధ్యక్షుడిని మారిస్తే పార్టీ కొంతమేర బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.