Corona Virus: 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ కోసం విపరీతమైన డిమాండ్... రష్యాకు ఆర్డర్ల వెల్లువ
- తొలి వ్యాక్సిన్ తీసుకువచ్చిన రష్యా
- రష్యా వ్యాక్సిన్ పై 20 దేశాల ఆసక్తి
- 120 కోట్ల డోసులకు ఆర్డర్లు
- భారత్ లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో ఒప్పందం
కరోనా వైరస్ భూతాన్ని తుదముట్టించే క్రమంలో తొలి వ్యాక్సిన్ ను రష్యా తీసుకువచ్చింది. రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్ వి' పనితీరుపై పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోయినా, ప్రపంచ దేశాలు మాత్రం దీనిపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ సరఫరా చేయాలంటూ రష్యాకు వెల్లువెత్తుతున్న ఆర్డర్లే అందుకు నిదర్శనం.
సుమారు 20 దేశాలు 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ కావాలంటూ రష్యాను కోరుతున్నాయి. దాదాపు 120 కోట్ల డోసుల మేర ఆర్డర్లు వచ్చాయి. భారత్ లో 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ సరఫరా కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం కుదుర్చుకుంది.
రష్యాకు చెందిన గమలేయా ఇన్ స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్ డీఐఎఫ్) తయారుచేస్తోంది. ఆర్ డీఐఎఫ్ ఈ ఏడాది డిసెంబరు నాటికి 20 కోట్ల డోసుల తయారీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రష్యాలోనే కాకుండా, భారత్, క్యూబా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, బ్రెజిల్, టర్కీ దేశాల్లో కూడా వ్యాక్సిన్ తయారు చేయనుంది. కొన్ని దేశాలతో ఒప్పందాలు ఖరారు కావాల్సి ఉంది.