Harish Rao: కేంద్రం ఆఫర్ చేసిన రూ. 4 వేల కోట్లకు ఆశపడ్డ వైఎస్ జగన్: హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
- కార్పొరేట్ ముసుగు వేసుకున్న బీజేపీ ప్రభుత్వం
- వ్యవసాయ బావులు, బోర్లకు మీటర్లు పెట్టేందుకు డబ్బు ఆఫర్
- కేసీఆర్ తిరస్కరిస్తే, జగన్ అంగీకరించారన్న హరీశ్ రావు
కార్పొరేట్ ముసుగు వేసుకున్న బీజేపీ ప్రభుత్వం, దేశంలో సరికొత్త జమీందారీ వ్యవస్థకు శ్రీకారం చుడుతోందని, అందులో భాగంగానే రైతులకు ఉచిత విద్యుత్ ను దూరం చేయాలన్న యోచనలో వ్యవసాయ బావులకు, బోర్లకు మీటర్లను అమర్చి నిండా ముంచాలని చూస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, రైతుల బావులకు, బోర్లకు మీటర్లు పెడితే తెలంగాణకు రూ. 2,500 కోట్లు, ఏపీకి రూ. 4 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశపెట్టిందని, ఏపీ సీఎం వైఎస్ జగన్ పోయిండు, 4 వేల కోట్లు తెచ్చుకున్నడు, మీటర్లు పెడుతున్నడిప్పుడు.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో రైతుల మేలు కోరుకుంటూ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం, తమ రైతులకు మీటర్లు, బిల్లులు వద్దంటూ ఆ ఆఫర్ ను తిరస్కరించారని అన్నారు. మొక్కజొన్నల దిగుమతిపై సుంకాలను తగ్గించడంపైనా కేసీఆర్ మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని డిమాండ్ చేసిన ఆయన, విదేశాల నుంచి మొక్కజొన్నలు తెచ్చి, ఇక్కడి కోళ్లకు వేస్తే, మనం పండించే మొక్కజొన్న పంటను ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. దేశమంతా వ్యతిరేకిస్తున్నా, ఈ బిల్లులను బలవంతంగా ఎందుకు తీసుకుని వచ్చారో కేంద్రం చెప్పాలని ప్రశ్నించారు.