IPL 2020: రికార్డు సృష్టించిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్
- ఐపీఎల్ మొదటి మ్యాచ్ ఆడిన చెన్నై, ముంబయి
- వరల్డ్ వైడ్ 20 కోట్ల మంది వీక్షించినట్టు వెల్లడి
- మరెక్కడా ఇంతటి వీక్షణ లేదన్న బీసీసీఐ
ప్రపంచంలో అనేక క్రికెట్ లీగ్ లు ఉన్నప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు ఉన్న క్రేజ్ మరే ఇతర లీగ్ కు లేదు. ఆటగాళ్లకు పారితోషికం నుంచి ప్రేక్షకాదరణ వరకు ఐపీఎల్ కు పోటీయేలేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ ను కోట్లాది మంది వీక్షిస్తుంటారు.
ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ టీవీ వీక్షణల పరంగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. అబుదాబిలో శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో 20 కోట్ల మంది చూశారు. ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా, ఏ క్రీడలో అయినా, ఏ దేశంలో అయినా టీవీ, డిజిటల్ వ్యూస్ పరంగా ఇది రికార్డు అని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తెలిపారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూఏఈలో నిర్వహిస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించకపోవడం తెలిసిందే. దాంతో ఓపెనింగ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు టీవీలకు, ఐప్యాడ్లు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయిన విషయం వ్యూయర్ షిప్ గణాంకాల ద్వారా అర్థమవుతోంది. పైగా, టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో కనిపించింది ఈ మ్యాచ్ తోనే. దాంతో చెన్నై, ముంబయి మ్యాచ్ కు వ్యూస్ వెల్లువెత్తాయని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.