Smart Phone: 50 డాలర్లకే స్మార్ట్ ఫోన్... భారత మార్కెట్లో ఆధిపత్యం కోసం ముఖేశ్ అంబానీ ప్రణాళికలు
- జియోతో సంచలనం సృష్టించిన ముఖేశ్ అంబానీ
- స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై ఆధిపత్యం కోసం ప్రణాళికలు
- చవక ఫోన్ కోసం తయారీదారులతో చర్చలు
భారత టెలికాం రంగంలో జియో ఓ విప్లవం అని చెప్పాలి. అత్యంత చవకగా డేటా, ఉచిత కాల్స్ తో జియో మిగతా ఆపరేటర్లకు సవాల్ విసిరింది. అంతేకాదు, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి దిగ్గజాలను విస్మయానికి గురిచేస్తూ తక్కువ సమయంలోనే దేశంలో అగ్రగామి టెలికాం సంస్థగా ఎదిగింది. ఈ క్రమంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై కన్నేశారు. చైనా కంపెనీ షియోమీ ఆధిపత్యం సాగిస్తున్న స్మార్ట్ ఫోన్ రంగంలో ప్రవేశించడమే కాకుండా, ఉన్నతస్థానానికి చేరాలన్నది ముఖేశ్ ప్రణాళిక.
ఇందుకోసం ఆయన భారత్ లోని మొబైల్ ఫోన్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు. అత్యంత చవకగా రూ.4 వేలకే స్మార్ట్ ఫోన్ అందించాలన్నది ముఖేశ్ వ్యూహం. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ తో మార్కెట్లో షియోమీకి సవాల్ విసరాలని భావిస్తున్నారు. అంతేకాదు, వచ్చే రెండేళ్లలో 200 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది.
ముఖేశ్ ఆశిస్తున్నట్టుగా ఈ ఫోన్ రూ.4 వేలకే అందుబాటులోకి వస్తే మాత్రం కచ్చితంగా అది మార్కెట్ ను చేజిక్కించుకునే ఆయుధం అవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.