Sushant Singh Rajput: మరణానికి ముందు... రూ. 6 కోట్ల పారితోషికానికి సినిమాకు సంతకం చేసి, తర్వాత రూ. 12 కోట్లు డిమాండ్ చేసిన సుశాంత్!
- సుశాంత్ కు టాలెంట్ మేనేజర్ గా పనిచేసిన జయ
- జూన్ 5న చివరిసారిగా మాట్లాడాను
- అప్పటికే మానసికంగా కుంగిపోయానని చెప్పాడు
- అధికారుల విచారణలో జయా సాహా
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు టాలెంట్ మేనేజర్ గా పనిచేసిన జయసాహా, ఎన్సీబీ విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించినట్టు సమాచారం. ఈ కేసును సీరియస్ గా తీసుకుని సుశాంత్ ఆత్మహత్యకు కారణాలను అన్వేషిస్తున్న అధికారులు, ఆయనతో సంబంధాలున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. ఇందులో భాగంగా జయా సాహాను రెండు రోజుల పాటు విచారించగా, చివరిగా తాను జూన్ 5న సుశాంత్ తో ఓ సినిమా గురించి మాట్లాడానని ఆమె వెల్లడించినట్టు తెలుస్తోంది.
సుశాంత్ కు టాలెంట్ మేనేజర్ గా ఉన్న తాను పలు ఆఫర్లను సుశాంత్ కు తెచ్చానని, 2016 నుంచి అతనికి సేవ చేశానని చెప్పిన ఆమె, మార్చిలోనే సుశాంత్ ప్రవర్తన మారిపోయిందని, దీంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఇంట్లో ఉన్న కాసేపట్లో హాల్, బెడ్ రూమ్ మధ్య చాలాసార్లు తిరిగాడని, కుమార్ మంగళ్ తెరకెక్కించాలని భావించిన చిత్రం గురించి తాము మాట్లాడుకున్నామని విచారణలో తెలిపినట్టు తెలుస్తోంది.
కథ నచ్చిన తరువాత రూ. 6 కోట్లకు సినిమా చేసేందుకు అంగీకరించిన సుశాంత్, ఆ తరువాత రూ. 12 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేశాడని వెల్లడించింది. అంతకన్నా ముందు 'సన్ చురియా' సినిమాకు రూ. 5 కోట్లు,'కేదార్ నాథ్' కు రూ. 6 కోట్లు తీసుకున్న సుశాంత్, 'డ్రైవ్' కు రూ.2.25 కోట్లు, 'చిచ్చోరే' కు రూ. 5 కోట్లు, 'దిల్ బేచారా'కు రూ. 3.5 కోట్లు తీసుకున్నాడని కూడా ఆమె తెలిపింది. ఇక తాను 2016 నుంచి 2019 మధ్య 21 బ్రాండ్లతో సుశాంత్ కు డీల్స్ కుదిర్చానని పేర్కొన్న ఆమె, గత సంవత్సరం డిసెంబర్ లోనే తాను మానసికంగా కుంగిపోయానని సుశాంత్ వెల్లడించినట్టు అధికారుల విచారణలో పేర్కొంది.