Suresh Angadi: కరోనాతో కన్నుమూసిన కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి
- ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
- కరోనాతో మృతి చెందిన తొలి కేంద్ర మంత్రి
- వరుసగా నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నిక
రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. కర్ణాటకలోని బెళగావి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన సురేశ్ ఈ నెల మొదట్లో కరోనా బారినపడి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కరోనా కారణంగా మృతి చెందిన తొలి కేంద్రమంత్రి సురేశే. కర్ణాటకకే చెందిన బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ ఇటీవలే కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పుడు మరో ఎంపీ మృతి చెందడంతో బీజేపీ నేతలు విషాదంలో మునిగిపోయారు. సురేశ్ అంగడికి భార్య మంగల్ సురేష్ అంగడి, ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు.
2001 నుంచి 2004 వరకు బీజేపీ బెళగావి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సురేశ్ 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009, 2014లోనూ ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎన్నికైన ఆయనను రైల్వే శాఖ సహాయమంత్రి పదవి వరించింది. సురేశ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకురాలు శోభ కరంద్లాజె తదితరులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.