Corona Virus: డెంగీ వచ్చి, తగ్గిన వారిలో కరోనా తీవ్రత కనపడడం లేదు: డ్యూక్ వర్శిటీ అధ్యయనంలో వెల్లడి
- డెంగీ వచ్చిన వారిలో యాంటీ బాడీలు
- కరోనా వైరస్ ను అడ్డుకుంటున్నాయి
- తమ పరిశోధనల్లో తేలిందన్న ప్రొఫెసర్లు
ప్రపంచ దేశాలన్నీ కరోనాను పారద్రోలేందుకు వ్యాక్సిన్ ను కనుగొనే ప్రయత్నాల్లో ప్రస్తుతం వున్నాయి. వంద శాతం పనిచేసే వ్యాక్సిన్ ను శ్వాసకోశ వ్యాధులకు కనిపెట్టే అవకాశాలు లేవని, కనీసం 50 నుంచి 60 శాతం మేరకు ప్రభావం చూపే వ్యాక్సిన్ వచ్చినా సరిపోతుందని ఆంటోనీ ఫౌసీ వంటి అంటువ్యాధి నిపుణులు చెబుతున్న వేళ, మరో ఆసక్తికర విషయాన్ని డ్యూక్ వర్శిటీ ప్రొఫెసర్లు వెల్లడించారు.
ఒకసారి డెంగీ వచ్చి, తగ్గిపోయిన వారిలో కరోనా వ్యాధి నిరోధక శక్తి అధికమని, వారిలో లక్షణాలు బయటకు కనిపించకుండానే వైరస్ నశిస్తుందని వర్శిటీ ప్రొఫెసర్ మైగుల్ నికోలెలిస్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ లో ఎంతోమందిపై తాము అధ్యయనాలు చేసిన తరువాత ఈ విషయాన్ని కనుగొన్నామని ఆయన స్పష్టం చేశారు.
కరోనాను పూర్తిగా నిరోధించేంతటి శక్తి లేకపోయినా, వారిలోని యాంటీ బాడీలు వైరస్ ను అడ్డుకుంటున్నాయని, వారిలో మరణాలు ఆగుతున్నాయని, వ్యాధి తీవ్రత కూడా కనిపించలేదని అన్నారు. డెంగీ వ్యాధి విస్తృతంగా ఉన్న దేశాల్లో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డెంగీ వ్యాధికి కారణమైన ఫ్లావీ వైరస్ కు, కొవిడ్-19కు సారూప్యం ఉండటమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు.