Pawan Kalyan: ఆ సమయంలో శివంతి ఆదిత్యన్ కు నేనెవరో కూడా తెలియదు: పవన్ కల్యాణ్
- నేడు భారత ఒలింపిక్ సంఘం మాజీ చీఫ్ ఆదిత్యన్ జయంతి
- నీరాజనాలు అర్పించిన పవన్
- అడగ్గానే రైఫిల్ సంఘంలో స్థానం కల్పించారని వెల్లడి
తమిళ మీడియా రంగ దిగ్గజం, క్రీడా ప్రముఖుడు, మాజీ మంత్రి 'పద్మశ్రీ' శివంతి ఆదిత్యన్ జయంతి సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవలందించిన మహానుభావులను సందర్భానుసారం స్మరించుకోవడం మన విధి అని పవన్ పేర్కొన్నారు. శివంతి ఆదిత్యన్ గురించి తెలియని వారు తమిళనాడులో ఎవరూ ఉండరని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా పనిచేసినా, రాజకీయాల్లో కొనసాగకుండా క్రీడలు, పాత్రికేయ రంగానికి విశేష సేవలందించారని కొనియాడారు. 9 ఏళ్ల పాటు భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరించారని తెలిపారు.
తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పాత్రికేయాన్ని స్వీకరించి ప్రముఖ తమిళ దినపత్రిక దినతంతిని 15 ఎడిషన్లకు విస్తరించిన ఘనత ఆదిత్యన్ కు దక్కుతుందని పేర్కొన్నారు. ఇవేకాకుండా, మలై మలర్ మ్యాగజైన్, తంతి టీవీలతో తమిళనాడు పాత్రికేయ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగారని కీర్తించారు. అంతటి గొప్ప వ్యక్తితో తనకు పరిచయం ఉందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
తాను చెన్నైలో ఉన్న సమయంలో రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ లో తనకు సభ్యత్వం ఇచ్చారని, అప్పుడు ఆ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా శివంతి ఆదిత్యన్ ఉన్నారని తెలిపారు. అయితే, ఆ సమయంలో తాను ఎవరో ఆయనకు తెలియదని, కానీ ఇస్ఫాహానీ అనే పరిచయస్తుడి ద్వారా వెళ్లి కలిశానని, వెంటనే మెంబర్షిప్ ఇచ్చారని పవన్ గుర్తు చేసుకున్నారు. అప్పటికే ఆయన చాలా గొప్ప స్థాయిలో ఉన్నారని, ఆ తర్వాత రైఫిల్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రెండు ఈవెంట్లకు తనను కూడా ఆహ్వానించారని వెల్లడించారు.
అటువంటి గొప్ప మానవతావాది ఆదిత్యన్ జయంతి నేడు అని వివరించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఆదిత్యన్ ఘనతలను స్మరించుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ నీరాజనాలు అర్పిస్తున్నానంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.