Kesineni Nani: ఆ కట్టుబాట్లు పాటిస్తే జగన్ చరిత్రలో నిలిచిపోతారు: కేశినేని నాని
- తిరుమల డిక్లరేషన్ పై తీవ్ర చర్చ
- నిన్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
- కట్టుబాట్లు పాటించకపోతే చరిత్రహీనులేనన్న కేశినేని
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం తిరుమల పర్యటనలో డిక్లరేషన్ అంశం విపరీతంగా చర్చకు వచ్చింది. దీనిపై వైసీపీ నేతలకు, విపక్షాలకు మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధం కూడా జరిగింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా ట్విట్టర్ లో స్పందించారు.
ఏ మతానికి అయినా, ఏ కులానికి అయినా, ఏ ప్రాంతానికి అయినా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఉన్నాయని, అవి తరతరాలుగా వస్తున్నాయని కేశినేని నాని తెలిపారు. అయితే, అత్యున్నత స్థాయిలో ఉన్నవారు వాటిని పాటిస్తే ఒక గొప్ప ఒరవడి సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారని, పాటించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
సీఎం జగన్ నిన్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ మేరకు సీఎంవో చేసిన ట్వీట్ ను కేశినేని రిట్వీట్ చేశారు.